ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని, ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి నరేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్, శివవీధిలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల జాతర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ తల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మా దైవం నృత్యాలు అందర్నీ ఆకర్షింప చేశాయి సుమారు 50 మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
