కేంద్ర జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద జిల్లా మహిళకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు
ఆనందను సన్మానించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అమన్ గల్ మండలం చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తెలగమల్ల ఆనంద ‘జల వనిత’ (వాటర్ ఉమెన్)గా ఎంపికయ్యారు. ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమం అమలులో ఆమె చేసిన కృషికి గాను ఆమెను ఎంపిక చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమం -2026’లో తెలగమల్ల ఆనంద పాల్గొన్నారు; ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. జల మహోత్సవ్ కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం ముగ్గురు మహిళా సర్పంచులు, ముగ్గురు ‘జల వనితలు’, ముగ్గురు స్వయం సహాయక బృందాల మహిళలు ఎంపికయ్యారు. ఎంపికైన ఆ ప్రతినిధులలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలగమల్ల ఆనంద ఒకరు. కాగా, జల్ జీవన్ మిషన్ అమలులో ఆనంద చేసిన విశేష కృషిని కేంద్ర జల మిషన్ శాఖ గుర్తించి ఆమెను జల వనితగా ఎంపిక చేయడం పట్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలగమల్ల ఆనందను అభినందిస్తూ సోమవారం కొంగరకలాన్‌లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో Iఘనంగా సన్మానించారు.