రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : అనుమతులు లేకుండా నడుపుతున్న ఆర్(పి)ఎంపి క్లినిక్ లపై జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శనివారం పట్టణం లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఇటీవల ఓ ఆర్ఎంపి వైద్యుని వద్ద చికిత్స తీసుకున్నా కాకతీయ కాలనీకి చెందిన గొల్లపల్లి శ్రీనాథ్ అస్వస్థకు గురై మృతి చెందినట్లు ఆరోపించారు. ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లుగా అధిక మోతాదులతో చికిత్స అందిస్తున్న వారిని గుర్తించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటించి కేసు నుంచి ఆర్ఎంపీని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైద్య అధికారులతో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుడైన వైద్యునిపై కేసు నమోదు చేయాలన్నారు.పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, లింగయ్య, సత్యనారాయణ,పౌలు, వెంకటస్వామి, సాంబయ్య, మొండి తదితరులు పాల్గొన్నారు.