Take a fresh look at your lifestyle.

‘జనగణన’ పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర:

జనగణన-2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండవ దశ శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ పనులను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈసారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కోసం ‘సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఆధునిక యాప్‌లు, పోర్టల్స్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందని, పొరపాట్లు నివారించవచ్చని అన్నారు. జనగణన నమోదు ప్రక్రియను రెండు విడతల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ముందుగా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారని చెప్పారు. జనగణన ద్వారా ప్రజల సంక్షేమం అనే నినాదంతో ప్రతి పౌరుడి వివరాలు నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో సిబ్బంది పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అధికారులకు జనగణన కిట్లను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.