- వివక్షను అధిగమించి సత్తాచాటుకుంటున్నారు.
- అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని నిరూపించుకున్నారు.
- అంకితభావంతో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ల విధులు.
- రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అనునిత్యం సమాజంలో అవమానాలు.. వివక్ష ఎదుర్కొంటోన్న టాన్స్ జెండర్లు.. దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తమ సత్తా చాటారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. తమకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాన్స్ జెండర్లు నిరూపించారని చెప్పారు. గత ఆరు నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లిష్టమైన ట్రాఫిక్ డ్యూటీని క్రమశిక్షణతో వహిస్తోన్న ట్రాన్స్ జెండర్లు.. ప్రతి ఒక్కరిలో సమర్థత ఉంటుందని నిరూపించుకున్నారని చెప్పారు. గత ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించిందని చెప్పారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్ గా ట్రాన్స్ జెండర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేవలం పది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని అమలు చేసి సర్కార్ రికార్డు సృష్టించిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిన తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖలో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సీతక్క తెలిపారు. ట్రాన్స్ జెండర్ల మీద వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది గౌరవప్రద ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావాలి అని మంత్రి పిలుపునిచ్చారు. పోలీస్ డ్రెస్ లో ట్రాన్స్ జెండర్లను చూసి సామాన్యులు సెల్యూట్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ట్రాన్స్ జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమీవేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
