- రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు.
- నిబంధనలు పాటించని 93బస్సుల సీజ్.. కేసులు నమోదు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. నిబంధనలను పాటించని బస్సులను సీజ్ చేస్తున్నారు.సంబంధిత పాఠశాలల యజమాన్యాలపై కేసులను సైతం నమోదు చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.రోడ్డు రవాణా శాఖ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయని అనేక ఆరోపణలు పలు సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలను పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం నుంచి రాష్ట్ర వాప్తంగా పాఠశాలలు పున ప్రారంభం కావడంతో ప్రైవేటు బస్సులపై ఆర్టీయే అధికారులు పెద్దఎత్తున తనిఖీలు చేశారు. ఉదయం 7 గంటల నుంచే ఆర్టీఏ అధికారులంతా రోడ్లపైకి వచ్చి పాఠశాలల బస్సులను విధిగా పరిశీలించారు.ఇందులో నిబంధనలను పాటించని వారిపై అప్పుడికప్పుడు కేసులు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 93 బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.వాటిల్లో అత్యధికంగా హైదరాబాద్ లోనే 31 బస్సులు ఉండడం విశేషం.రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది.ఈ జిల్లాలో మొత్తంగా 19 బస్సులను అధికారులు సీజ్ చేశారు. అలాగే మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలో 7 బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్, నగర శివారుల్లోనే అత్యధిక పాఠశాలలు ఉండడంతో మూడు జిల్లాలో అత్యధిక బస్సులు సీజ్ కు గురయ్యాయి.ప్రధానంగా స్కూల్ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఆర్టీఏ తప్పనిసరి చేసింది. అలాగే సీట్ బెల్ట్‌లు, సీసీటీవీ కెమెరాలతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ బస్సులలో అమర్చాలని విధిగా సూచించింది.బస్ డ్రైవర్లకు వాహనం నడపడంలో తగిన శిక్షణ, లైసెన్స్, అనుభవం ఉండాలని స్పష్టం చేసింది.డ్రైవర్లు డ్రంకెన్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ చేయకుండా ఉండేలా రెగ్యులర్ టెస్టులు నిర్వహించడంతో పాటు బస్సులు రెగ్యులర్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలని పేర్కొన్నది. పాతబడిన లేదా రిపేర్ అవసరమైన బస్సులను రోడ్డుపై తీసుకరావొద్దని బస్సుల సీటింగ్ కెపాసిటీని మించి విద్యార్థులను తీసుకెళ్లకూడదని సైతం వెల్లడించింది.ఇక బస్సులలో విద్యార్ధులను పర్యవేక్షించడానికి ఒక అటెండర్ లేదా టీచర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.ఈ నిబంధనలను పాటించని స్కూల్ బస్సులకు భారీ జరిమానాలు విధించారు.డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు.
Prev Post