- డిజిటల్ సమాచారంపై అప్రమత్త అవసరం
- డిపివో, ఎన్ ఐ సి అధికారుల సూచన
- హాజీపల్లి గ్రామంలో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి) : సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం హాజీపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) జిల్లా అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి,ఎన్ఐసి జిల్లా అధికారిణి స్వర్ణ లత,హాజీపల్లి గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ కార్యకర్తలు,సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.
ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి
ఈ సందర్భంగా డిపివో,ఎన్ ఐసి అధికారిణి మాట్లాడుతూ..సురక్షిత ఇంటర్నెట్ వినియోగం వల్ల సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు.వ్యక్తిగత సమాచారం కూడా సురక్షితంగా ఉంటుందన్నారు.సురక్షిత ఇంటర్నెట్ ను ఎలా వినియోగించుకోవాలో ప్రజలు అవగాహన కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు.సమాజంలో సైబర్ మోసాలను తగ్గించేందుకు ప్రజల్లో సురక్షిత డిజిటల్ ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు.ఇంటర్నెట్ వినియోగంలో బలమైన పాస్‌వర్డ్ల ఉపయోగం,ద్విపాత్రిక ధృవీకరణ, సురక్షిత వెబ్ బ్రౌజింగ్ తప్పనిసరన్నారు.సురక్షిత ఇంటర్నెట్ పై అవగాహన కార్యక్రమాలు సైబర్ భద్రతను బలోపేతం చేయడంలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.అధికారులు,ప్రజలందరూ జాగ్రత్తగా,బాధ్యతాయుతంగా,సురక్షిత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆన్లైన్ నేరాలపై అవగాహన
ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాల నివేదిక విధానాల గురించి నిపుణులు వివరించారు.సైబర్ భద్రత, ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉపయోగించుకునే మార్గాలు,ఆన్‌లైన్ మోసాలు,సోషల్ మీడియా దుర్వినియోగం నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ తదితర అంశాలపై నిపుణులు ప్రజలకు వివరించారు.