- రాష్ట్రంలో సాగునీటి రంగానికి మహార్దశ.
- సీతారామసాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి మంచి పరిణామం.
- కాళేశ్వరం అంతర్భాగ రిజర్వాయర్లకు ప్రమాదముందని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది.
- మీడియాతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఏడాదిన్నరగా తాము చేసిన కృషి ఫలించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.సీతారామసాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వడం..తెలంగాణలో సాగునీటి పురోగతిలో ముందడుగు అన్నారు.హైదరాబాద్ లోని ఎచ్ఐసీసీ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆ ప్రాంగణం ఆవరణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేంద్రం అనుమతితో గోదావరి జలాల వినియోగానికి భారీ స్థాయిలో అవకాశం లభించినట్లు మంత్రి తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గోదావరి నదీ జలాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని చెప్పారు.ఇప్పుడు సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల గోదావరి నీరు లభించనుందని వివరించారు.ఇది సుమారు 8 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడనుందన్నారు. ఈ అనుమతులు తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన నేపథ్యంలో, సీతమ్మసాగర్ బ్యారేజి నమ్మకంగా నిలబడుతుందా అని కేంద్ర జలవనరుల శాఖ ప్రశ్నించిందని చెప్పారు తగిన అన్ని సాంకేతిక వివరాలు పంపిన తర్వాతే అనుమతి ఇచ్చిందని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు జరగబోయే ముంపు నష్టాన్ని నివారించేందుకు ప్రొటెక్షన్ వాల్ కోసం కేంద్ర నిధులు కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు.గత ప్రభుత్వం కృష్ణా జలాల పంపకంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని, న్యాయం కోసం ట్రిబ్యునళ్ల వద్ద వాదిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోందని స్పష్టం చేశారు.మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం ప్రాజెక్టులను నాశనం చేశారని ఆరోపించారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు చెప్పిందని ఆయన అన్నారు.ఇలా రూ. లక్షల కోట్లు వృథా చేస్తే ఇతర దేశాల్లో కఠిన శిక్షలు పడేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని, నాణ్యత లోపాలను వివరించారు.మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ద్వారా తేలిన విషయాలను ప్రజలు గుర్తించాలన్నారు. ఇప్పుడా మూడు రిజర్వాయర్లు నిరుపుయోగంగా ఉన్నా రాష్ట్రంలో అత్యధిక పంట పండిందని చెప్పారు. యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు.దశాబ్దకాలంగా బీఆర్ఎస్ సాధించలేనిది తాము ఏడాదిన్నరలోనే సాధించామని చెప్పారు.