సింగరేణి సీఎండీతో సి.బి.ఎల్ కంపెనీ ప్రతినిధుల భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :

తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని కోరుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సి.బి.ఎల్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతిని కోరింది. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సీఎండీని కలిసిన సి.బి.ఎల్ (కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో) బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, సి.బి.ఎల్ సీఈవో వినీసియస్ అల్వారెంగా తమ కంపెనీ వివరాలు వివరించారు. బ్రెజిల్ దేశంలో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని తెలిపారు. సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. తాము సింగరేణి తో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రపంచంలో లిథియం కీలక ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో ఉన్న లాభదాయకత గురించి వివరించారు. కాగా సింగరేణి సంస్థకు సంబంధించిన వివరాలను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, పర్సనల్, ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పోట్రు వివరించారు. బ్రెజిల్ దేశంలో కీలక ఖనిజ అవకాశాలను, లాభదాయకత తదితర అంశాలను తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి ఉన్నతాధికారులు పేర్కొన్నారు.