– TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ
ముద్ర, సిద్దిపేట:
పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు ఆచరణలో ప్రదర్శించే అద్భుత వేదికే వైజ్ఞానిక ప్రదర్శనలు అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సాయి జీడీఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘ఉడాన్–2K26’ సైన్స్ ఎక్స్పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆలోచనా శక్తి, పరిశోధన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని, అవి సమాజ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు ఆవిష్కరణలకు మొదటి అడుగని విరాహత్ అలీ పేర్కొన్నారు. సైన్స్ అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతిని అర్థం చేసుకోవడమేనని, అది మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం భాగమై ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయి జీడీఆర్ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టి. సోమేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.