- జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి పిలుపు
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలోని18వ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మి మనోహర్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజక వర్గ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.ఈ యాత్రను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తో కలసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి,ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ ఆలోచనలను కాపాడుకోవాల్సిన అవసరం వుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.గత ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. ఆయన వ్యాఖ్యలను లోక్ సభ స్పీకర్, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు పోయినాపట్టించుకోలేదని చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ, దేశం యావత్తు తీవ్రంగా ఖండించిందన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం,మహాత్మా గాంధీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ తల పెట్టిన ప్రయాణానికి మార్గదర్శకాలని,వాటిని సమాజంలో బలంగా ప్రచారం చేయాలని సూచించారు.అదే విధంగా,గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ వరకు,ప్రతి బూత్,ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అప్రజాస్వామికంగా పాలన సాగించిందని, వాటిని ప్రజల ముందు బహిర్గతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా ముక్తార్ జోహార, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, కార్పొరేటర్ చామకూరి వెంకట నారాయణ, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వర రావు, నాయకులు పాకాలపాటి విజయ నిర్మల, శేష గిరి, మేడా వేంకటేశ్వర రావు, గజ్జెల్లి వెంకన్న, షేక్ ఖాదర్, బాణాల లక్ష్మణ్, పట్టాభి, షేక్ పాషా, సంపటం నరసింహ రావు, కందుల శ్రీనివాస్, ప్రతిభా రెడ్డి, చంద్రిక, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు.