రానున్న రోజుల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఖర్చుతో కూడిన ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ ను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. సివిల్స్ కోచింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్న ఆయన రానున్న రోజుల్లో ఆ శిక్షణ హైదరాబాద్ లోనే అందిస్తామన్నారు. విద్యార్ధుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చర్స్ ను తీసుకుంటామన్నారు. అలాగే మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని వివరించారు. గురువారం 59 దళిత కులాల సంఘాల నాయకులు లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్, కాచిగూడ లోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. అనంతరం వారు మంత్రి అడ్డూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కోచింగ్ తీసుకునే అభ్యర్థుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్‌లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు. సివిల్స్, గ్రూఫ్–1 గ్రూఫ్–2 కోచింగ్ కోసం మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని మంత్రి తెలిపారు. ఎస్సీ యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రాతినిధ్యం పెరిగేలా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు. తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామన్నారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా (పరిపాలకుడిగా) తీర్చిద్దిదాలనే అనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అలాగే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.