ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యమకారులతో భేటీ
కమిటీ విధి విధానాలు, ఉద్యమకారుల హామీలపై చర్చ
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉద్యమకారుల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పునరుద్ఘాటించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులు మంత్రి పొన్నం ను గురువారం హైదరాబాద్ లోని మంత్రుల భవనాల సముదాయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుల హామీల అమలుకు ఏర్పాటు చేయతలపెట్టిన కమిటీకి సంబంధించిన విధి విధానాలు, ఉద్యమకారుల హామీలపై చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం కావాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. ఇదీలావుంటే.. ఎన్నికల హామీల జాప్యంపై ఇటీవల స్పందించిన రాష్ట్ర హైకోర్టు.. వాటి అమలులో ఉన్న ఇబ్బందులతో పాటు ఎప్పటిలోగా మెనిఫెస్టో హామీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టిసారించినట్లు తెలుస్తున్నది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పథకం కింద ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు సుమారు రూ.25వేల పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు కల్పించాలన్న హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు నాలుగు రోజుల క్రితం విచారణ జరిపింది. అభయహస్తం పథకంకింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులకు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని థర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హతల పరిశీలనలో ఆలస్యం చేయకుండా, విధివిధానాల ప్రకారం కేసులను పరిష్కరించి ప్రయోజనాలు అందించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తాజాగా మంత్రి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.