Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్ ప్రకంపనలు

  • బాధితుల వాంగ్మూలాలు సేకరణలో సిట్​ దూకుడు.
  • వెలుగులోకి సంచలన విషయాలు.
  • చేవెళ్ల ఎంపీ, ఏబీఎన్​ ఎండీ స్టేట్​ మెంట్లు రికార్డ్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు..ఫోన్లు ట్యాప్​ అయిన బాధితులకు నేరుగా ఫోన్లు చేసి విచారిస్తున్నారు.ఈనేపథ్యంలో శుక్రవారం చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు.ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన ఫోన్ ట్యాపింగ్ కు గురైన ఆధారాలను చూపించారు.గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో కేసీఆర్​, కేటీఆర్ లు దిగజారి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని మండిపడ్డారు. చట్టం, వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై గౌరవం లేకుండా వ్యవహరించారన్నారు. అధికారం, తమ పదవులు కాపాడుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 2018లో ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి అప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి గెలిచారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో బీఆర్​ఎస్​ అధికారంలో రాదనీ, కేసిఆర్ మళ్లీ పదవిలోకి రారన్నారు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ సిట్​ తో సాధ్యం కాకపోతే.. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను జితేందర్ రెడ్డి తో మాట్లాడిన ఫోన్ కాల్ ను సిట్ అధికారులు తనకు వినిపించారన్నారు. ఆ ఫోన్ కాల్ ను ప్రణీతరావు రికార్డు చేసినట్లు నిర్ధారించారని చెప్పారు. అయితే ఇంకొన్ని ఫోన్ కాల్స్ ను డిలీట్ చేశారని ఎంపీ చెప్పారు. ఎన్నికల సమయంలో పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారన్నారు. ఇంట్లో కంప్యూటర్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా నా ఇంట్లో ఎలా తనిఖీలు చేశారని పోలీసులను ప్రశ్నిస్తే.. పోలీసులపై దాడి చేశానంటూ నా మీదే తిరిగి కేసు పెట్టారన్నారు.ఈ అక్రమ కేసు విషయంలో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయమంటే చేయలేదని చెప్పారు. అదే సమయంలో తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తనను అరెస్టు చేయాలని చూశారని ఎంపీ వివరించారు. ఆ సమయంలో అప్పటి డిజిపి తనను అరెస్టు చేస్తారని చెబితే… తెలంగాణ ఉద్యమ కారుడినైన తానే బీఆర్​ఎస్​ పాలనకు భయపడి రెండు వారాల పాటు బెంగళూరులో తలదాచుకున్నానని కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తెలిపారు. నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి నా భార్య కలవడానికి వస్తే ఆ ఫోన్‌ని కూడా ట్యాప్ చేసి ఫాలో చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. గంట పాటు వేమూరి రాధాకృష్ణ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. ఎస్‌ఐబీ వద్ద ఉన్న కాల్ డీటేయిల్ రికార్డ్స్‌లో వేమూరి రాధాకృష్ణ ఫోన్ నెంబర్ కూడా ఉండటంతో అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.