ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు (అక్రిడేషన్లు) ఇవ్వడంలో జాప్యం చేయడం తగదన్నారు. అలాగే సొంత ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న జర్నలిస్టుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, వారి సొంతింటి కల సాకారం చేయాలని కోరారు. విద్యా రంగంలో పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని, జర్నలిస్టుల పిల్లలు చదువుకునే ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తి ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా యంత్రాంగం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, జల్ద మనోజ్, కార్యదర్శులు సట్లహనుమాన్లు, రాజేశ్వర్,
డిఎస్ మధు, వరప్రసాద్, గంగారాం తదితరులు వారి వెంట ఉన్నారు.