ఎస్సీ, ఎస్టీ కేసును నీరుగార్చి, అగ్రకులాలకు వత్తాసు పలుకుతున్న తాండూర్ డిఎస్పిని వెంటనే సస్పెండ్ చేయాలి
- కొడంగల్ పర్సాపూర్ దళితుల భూములలో బలవంతంగా రోడ్ వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.
- కెవిపిఎస్ దళిత ప్రజాసంఘాల డిమాండ్.
వికారాబాద్, ముద్ర విలేకరి : ఎస్సీ, ఎస్టీ కేసులను నీరు గారిచి అగ్రకులస్తులకు వత్తాసు పలుకుతున్న తాండూర్ డిఎస్పి ని వెంటనే సస్పెండ్ చేయాలని, కొడంగల్ మండలం నర్సాపూర్ గ్రామంలో దళితుల భూములలో అక్రమంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కెవిపిఎస్, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, అంబేద్కర్ సంఘం, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాల ముందు నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాపోల్ మహిపాల్, ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్, బుస్సా చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యు.బుగ్గప్ప, ఎం.వెంకటయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం కొత్తూరు చంద్రయ్య, కొడంగల్ అంబేద్కర్ సంఘం యు.రమేష్ బాబులు మాట్లాడుతూ.. బెల్కటూర్ గ్రామ నిందితులని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న దళిత ప్రజాసంఘాల నాయకుల ఫై అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గు చేటు అని, వెంటనే అక్రమ కేసులు ఎత్తి వేయాలని, కొడంగల్ పర్సాపూర్ గ్రామాలో దళితుల భూములలో అక్రమంగా రోడ్ వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత గ్రామం బెల్కటూరు దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం, దళితులు పెళ్లి చేసుకొని భరత్ నిర్వహిస్తున్న సమయంలో అగ్రకులస్తులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనె, కుల వివక్ష అంటరానితనం, దళితులపై దాడులు జరగడం సిగ్గు చేటు అని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు వినయ్ కుమార్ మే నెల 18 న వివాహం చేసుకొని అదే రోజు భరత్ ఊరేగింపు చేస్తున్న సందర్బంలో దళిత పెళ్లి కుమారుని పెండ్లి భరత్ ఊరేగింపు అడ్డుకొని, దళితులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.దళితులపై దాడి చేసిన అగ్రకుల కులదురాహంకారులు, పెత్తందార్లను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్ పుట్టిన సొంత గ్రామంలో అవమానం జరగడం దురదృష్టకరమని అన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ప్రకారంసమానత్వం,17 ప్రకారం కువివక్ష నిషేదం, 21ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులను అగ్రకుల పెత్తందార్లు కాలారాస్తున్న ప్రభుత్వం, పోలీస్ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డురం అన్నారు. ఘటన జరిగి 28 రోజులు గడుస్తున్నా నేటికీ ఆ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గాని, జిల్లా ఎస్పీ గాని గ్రామాన్ని సందర్శించక పోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు.ఆ గ్రామంలో దళితులకు నేటికీ దేవాలయ ప్రవేశం లేదని, ఆ గ్రామం లో కులవివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు, దౌర్జన్యం నిరంతరం కొనసాగుతున్నా యని అన్నారు. సంబందిత అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పి ఆ గ్రామాన్ని వెంటనే సందర్శించి బాధితులను పరామర్శించి దళితులను దేవాలయం ప్రవేశం కల్పించి, నిందితులను అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
