- స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయనే ప్రభుత్వం నిర్ణయం.
- ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలు, హామీల సంగతేంటీ..?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే రైతు భరోసా పేరుతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు భరోసా పథకం అమలుకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలను గుర్తు చేశారు. వానాకాలం పంటకు రైతు భరోసా ప్రకటించిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటించిన గ్యారంటీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా, వడ్ల బోనస్, మహాలక్ష్మి కింద రూ.2500 నగదు, తులం బంగారం,ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీ, ఆగిపోయిన రైతు బీమా,ఆగిపోయిన రుణమాఫీ, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్టేసి.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ధ – తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారెంటీ కార్డు అమలుపై లేకపాయే అంటూ చురకలంటించారు.