Take a fresh look at your lifestyle.

ఆర్థిక.. ఆరోగ్య భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్పెషల్ సర్కారు విప్లవాత్మక నిర్ణయం ప్రతి కుటుంబానికి 5 లక్షల రక్షణ

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈ బడ్జెట్‌లో తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అనే పథకాన్ని జూన్ 2, 2026 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒకేసారి రాష్ట్రంలోని కోటిన్నర మంది ప్రజలకు వర్తించేలా రూపొందించిన ఈ పథకం, భారత్‌ సామాజిక భద్రతా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది.

జూన్ 2 నుంచి ఈ కొత్త పథకం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తారు. ఒక కుటుంబంలో ఆదాయం సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలనే మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, సంపాదించే వ్యక్తి దూరమైనప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన ఒకటెైతే, ఆర్థిక విపత్తు మరొకటి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అభయహస్తంలా ఈ రూ. 5 లక్షల బీమా మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది అన్నారు. ప్రపంచంలోని మరే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇటువంటి సామాజిక భద్రతా పథకం లేదని, ఇంత భారీ స్థాయిలో ఒకేసారి ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు బీమా కల్పించడం ఒక రికార్డు అని ప్రభుత్వం అభిప్రాయపడింది.

అర్హులు ఎవరు? లబ్ధిదారులను ఎలా నిర్ణయిస్తారు?
సాధారణంగా సంక్షేమ పథకాలు కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే పరిమితమవుతాయి. కానీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విషయంలో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సామాజిక, ఆర్థిక అంతరాలు లేవు. ఈ పథకం వర్తించడానికి పేద, మధ్యతరగతి లేదా ధనిక అనే వ్యత్యాసం లేదు. అన్ని వర్గాలకు వర్తింపు చేయాలని నిర్ణయించారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వం ఈ భరోసాను కల్పించనుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.15 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద రక్షణ పొందనున్నాయి.
లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల డేటాబేస్, ప్రజా పాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, ప్రతి కుటుంబం అని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినందున, రాష్ట్రంలోని ప్రతి రిజిస్టర్డ్ కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించే ఛాన్స్ ఉంది.

ఏ రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఉంది?
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా గతంలో ఇటువంటి బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ సంపాదించే వ్యక్తి మరణిస్తే బీమా సొమ్ము అందిస్తారు, అయితే ఇది ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, పేద కుటుంబాలకు పరిమితం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజనలను అమలు చేస్తోంది, కానీ వీటిలో లబ్ధిదారులు స్వయంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ పథకం ఎందుకు ప్రత్యేకం?
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైనది. ఎందుకంటే, ఇది కేవలం ఒక వర్గానికో లేదా కేవలం పేదలకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం తన సొంత ఖర్చుతో బీమా కల్పించనుంది. రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా ప్రభుత్వం ఈ భద్రతను కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.