- దోస్తానాతో నయవంచన.
- నమ్మితే నట్టేట ముంచే ప్రయత్నం.
- మాజీ సైనికోద్యోగికి చేదు అనుభవం.
కోరుట్ల, ముద్ర విలేఖరి: స్నేహం ముసుగులో చిననాటి స్నేహితుడు తనకు ద్రోహం తలపెట్టాడని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మాజీ సైనికోద్యోగి వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తోపారపు జగదీశ్వర్ తనను బోల్తా కొట్టించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 ఏళ్లుగా దేశసేవలో తరించి జన్మభూమికి వచ్చిన తనను ముప్పు తిప్పలు పెడుతున్నట్లు బోరుమన్నాడు.
20 ఏళ్ల తన కష్టార్జితం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో 5 లక్షల రూపాయలు తనకు పరిచయమున్న వ్యక్తి ఒడ్నాల రామారావుకు ఇప్పించిన తోపారపు జగదీశ్వర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయాడు.ఈ సార్ మంచోడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తాడంటూ తనను నమ్మించాడని కోట్లల్లో వెంచర్లు ఉంటాయని కథలెన్నో చెప్పి, తనకు ద్రోహం తలపెట్టాడని కన్నీటి పర్యంతమయ్యాడు.వ్యాపార నిమిత్తం అతడికి 5 లక్షల రూపాయలు అత్యవసరమని ప్రాధేయపడటంతో అప్పటికీ తనకు మనసొప్పక తిరస్కరించానని చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో నేను భరోసా, డోంట్ వర్రీ అంటూ రకరకాల కహానీలు చెబుతూ జగదీశ్వర్ నమ్మించాడు.ప్రభుత్వ ఉద్యోగిగా తాను జామీనుగా ఉంటానని, కల్లిబొల్లి కబుర్లు చెప్పాడని వాపోయాడు.వారం రోజుల పాటు తాను ఎక్కడికి వెళితే అక్కడకు వస్తూ 5 లక్షల రూపాయలు ఇచ్చేదాకా వెంటపడ్డాడని, సంవత్సరం లోపే డబ్బులు తిరిగి ఇప్పిస్తానంటూ కాకమ్మ కథలెన్నో చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. సంవత్సరం గడువు తర్వాత ఇద్దరూ కలిసి వక్రబుద్ది చూపించడం మొదలుపెట్టారని, డబ్బులు లేవని, ఉన్నప్పుడు ఇస్తామని వాయిదాల పర్వానికి తెరలేపారని వాపోయాడు.చివరికి విసిగివేసారి తాను మనోవేదనకు గురయినట్లు తెలిపాడు.అప్పటివరకు కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పలేదని స్నేహితుడు జామీనుగా ఉన్నాడని గుడ్డిగా నమ్మానని అదే అవకాశం తీసుకుని నాకు ద్రోహం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. అయితే డబ్బులు ఇక తిరిగిరావేమోనని డిప్రెషన్ కు లోనయినట్లు పేర్కొన్నాడు.ఈ విషయం కాస్తా తన కుటుంబసభ్యులకు తెలియడంతో అక్టోబర్ 2024లో ఆ ఇద్దరినీ పిలిపించి మాట్లాడినట్లు తెలిపాడు.డబ్బులు తీసుకున్న ఒడ్నాల రామారావు బతిమిలాడి, కొంచెం గడువు ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే మొదటి వాయిదా తర్వాత కూడా పదేపదే వాయిదాలు పెడుతూ 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని తెలిపాడు.
ఇక 3 లక్షల రూపాయలకు మళ్లీ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని వాపోయాడు.ఒడ్నాల రామారావుకు ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక కహానీ వినిపించేవాడని ఇక అలా కుదరదని చెప్పడంతో ఈ ఏడాది మార్చ్ 10వ తేదీ చివరి అవకాశం ఇవ్వాలంటూ బతిమిలాడినట్లు తెలిపాడు.సరే ఇదే చివరిది కావాలని, మళ్లీ వాయిదా కోరవద్దని ఒడ్నాల రామారావుకు చెప్పినట్లు పేర్కొన్నాడు. అయినా కూడా ఆ వాయిదా ప్రకారం డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు.చివరి అవకాశం గా మే 10 తేదీ నాడు ఎట్టిపరిస్థితుల్లో తాను డబ్బులు చెల్లించేవిధంగా బాండ్ పేపర్ రాసిచ్చినట్లు తెలిపాడు. ఈ వాయిదా కూడా పూర్తయినప్పటికీ వారిలో చలనం కనపడటం లేదని వాపోయాడు.దీన్నిబట్టి తాను గుడ్డిగా మోసపోయానని గ్రహించి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మౌనదీక్ష చేపట్టినట్లు పేర్కొన్నాడు.తోపారపు జగదీశ్వర్, ఒడ్నాల రామారావు తీరుకు తాను తీవ్ర మనోవేదనకు గురికావడంతో ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని వాపోయాడు. మెరుగైన వైద్యం కోసం డబ్బులు అవసరముందని ఎంత నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదని ఈ క్రమంలో తప్పనిపరిస్థితుల్లో తోపారపు జగదీశ్వర్ పనిచేసే మున్సిపల్ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేయాల్సిన దుస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యాడు.మాజీ సైనికోద్యోగిగా తనకు ఇదేమి కర్మ అంటూ బోరుమన్నాడు.జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించాడు.