- బీజేపీ ఎంపీలను నిలదీసిన మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బలహీన వర్గాల పట్ల మీకున్న అభిప్రాయాలు ఏంటి అని బీజేపీ ఎంపీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీసీ బిడ్డలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఆర్,. కృష్ణయ్య, డాక్టర్ కె. లక్ష్ణణ్‌లు బీసీలకు అన్యాయం చేయకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ చాంపియన్ అని, గుడ్డుకు వెంట్రక కట్టే పని పెట్టుకోవద్దని బీజేపీ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కులగణన విప్లవాత్మకమని స్వయంగా వారణాసి ప్రజా ప్రతినిధి (ఆర్ఎస్ఎస్) నేత తనతో అన్నారని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు దుర్భుద్ధిని విడనాడాలని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాద్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు మొట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్, దయాకర్‌లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకుని కుల సర్వే నిర్వహించుకుని కోర్టు ఆదేశాల మేరకు ప్రామాణిక సర్వే ప్రకారం గతంలో ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు, న్యాయమూర్తుల సలహాలు తీసుకొని శాసన సభలో తీర్మానం చేశామన్నారు. బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి గవర్నర్ కి అక్కడి నుండి రాష్ట్రపతి కి పంపామన్నారు. బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ బీసీ ల రిజర్వేషన్ల పై అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులను బీజేపీ నేతలే ఆపారన్నారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడవద్దని బీజేపీ నేతలకు మంత్రి పొన్నం హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందించి, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రాన్ని బీజేపీ నేతలు ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యూడల్ సిద్ధాంతాలతో అఢ్డుపడవద్దని, మీ నాయకులను కేంద్రం వద్దకు తీసుకెళ్ళి ఒప్పించాలని మంత్రి పొన్నం బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
