- కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసు.
- బీజేపీ, కాంగ్రెస్ ఎజెండా ఒక్కటే.
- కేసీఆర్ ను బదనాం చేయడమే వారి లక్ష్యం.
- మరో దేశంలో కాళేశ్వరం నిర్మించి ఉంటే.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది.
- కానీ మన దేశంలో మాత్రం కుచ్చితమైన రాజకీయాలకు పావుగా మారిందని కేటీఆర్ ఆగ్రహం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను బదనాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్ తో పాటు హరీష్ రావు స్పష్టం చేశారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రభుత్వ విధానపర నిర్ణయమన్నారు. అయితే ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులు, యంత్రాంగం పై ఉంటుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాలేశ్వరం అంశంలో దాచాల్సిందేమీ లేదన్నారు.ఇది సంపూర్ణంగా పారదర్శకంగా జరిగిన పని అని అన్నారు.ఇటీవల మా పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ప్రజెంటేషన్‌ను చూసి ఉంటే ప్రతి ఒక్కరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనం సులభంగా అర్థమయ్యేదని కేటీఆర్ అన్నారు.అరటిపండు వొలిచినట్టు గా హరీశ్ రావు వివరించారన్నారు.45 లక్షల ఎకరాలకు నీరు అందించేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ను ఇతర దేశాల్లో ఏ నాయకుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే ఆ దేశ చరిత్రలో వారి వారి పేరు అజరామరంగా, శాశ్వతంగా నిలిచిపోయేదన్నార. ఆ నాయకుడి పాలనను ప్రశంసలతో ముంచేత్తేవారన్నారు. కానీ మనదేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు ఇంతటి ఘనమైన కాళేశ్వరం ప్రాజెక్టు పావుగా మారిందని’’ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ ను బదనాం చేయాలని చూస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎలాగైనా మమ్మల్ని ఇరిటేట్ చేయాలని నోటీసులు ఇస్తున్నారన్నారు.మేము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సిన దంతా స్పష్టంగా చెప్పామన్నారు. సోమవారం కమిషన్ ముందు హరీశ్ రావు పూర్తి అంశాలు వివరించారన్నారు.ఇక కేసీఆర్ ను కమిషన్ కొత్తగా అడిగేందుకు ఏమీ ఉండదు ఉండదు,అంత వివరంగా మేము చెప్పాల్సింది అంతా చెప్పామని అని కేటీఆర్ అన్నారు.భాక్రా నాగల్, నాగార్జున సాగర్, నర్మద, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నాయని, కానీ కేసీఆర్ మాత్రం కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘ఇది సాధారణ విషయం కాదు.మరో దేశంలో ఇలా జరిగి ఉంటే కేసీఆర్ కు సమున్నత పురస్కారాలు వచ్చేవి’’ అని అన్నారు.కానీ మన దేశంలో మాత్రం బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో కట్టినందుకు ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రస్తుతం నడుస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారు.రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరు మా పార్టీలో లేర ని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మీడియా మేనేజ్‌మెంట్ తో ప్రధాని మోడీ దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కేవలం మీడియా మేనేజ్‌మెంట్ తో ప్రజల దృష్టిని మరల్చి కాలం గడిపే ప్రయత్నాలు కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు చేస్తున్నాయని విమర్శించారు.
Prev Post