- ఫోన్ ట్యాపింగ్ జరిగిందా..?
- మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి
- నేను రాజీనామా చేశాక.. హార్డ్ డిస్క్‌లు ధ్వంసం అయ్యాయా..?
- సిట్ విచారణలో ప్రభాకర్‌రావు ఎదురు క్వశ్చన్స్
- సుదీర్ఘంగా విచారించిన సిట్
- ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు వెళ్లారా..?
- రాజీనామా చేసిన రోజే హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు
- ఈ స్పెషల్ టీంను ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు
- ట్యాపింగ్ నెంబర్లు ఎవరిచ్చారు.. ట్యాపింగ్ తర్వాత వివరాలు ఎవరెవరికిచ్చారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్‌రావు విచారణ
- ఈ నెల 11న మళ్లీ రావాలని నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ సిట్బృందం ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు.ఈ కేసులో ఆయనను కీలక సూత్రధారిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ ఆయనను విచారిస్తున్నది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ కేసు మొదలైన తర్వాత ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ అమల్లో ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీం కోర్టు ఆర్డర్, వన్ టైం ఎంట్రీకి అనుబంధమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్ సహా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ ఆఫీస్‌కు చేరుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సహా ఐదుగురు సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారించింది.దాదాపు 8 గంటల పాటు విచారించిన సిట్ ఈ నెల 11న మళ్లీ విచారణకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు.
- నాకేం సంబంధం.
ఫోన్ ట్యాపింగ్ తో తనకేం సంబంధం లేదని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెల్లడించారు. సోమవారం విచారణకు హాజరైన ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. కోర్టులో వినిపించిన వదదలనే మరోసారి సిట్ ముందు చెబుతున్నట్లు తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేస్తుండటం గమనార్హం. ఫోన్ లు ట్యాప్ చేయాలని అధికారులకు తాను ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని అధికారులతో నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుడిని కాదని తెలిపారు. తాను డిసెంబర్ 4 వ తేదీ 2023 సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని అన్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్కులు ధ్వంసమయ్యాయని, ఆ పరిణామంతో తనకేం సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యులను ఈ కేసులో ఎందుకు ఇన్ వాల్వ్ చేయలేదో చెప్పాలన్నారు.అయితే, ప్రభాకర్‌రావు రావడంతో.. ఇక ఫోట్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చినట్టే అనుకున్నారు. కానీ, అసలే ఆయన మాజీ ఎస్‌ఐబీ చీఫ్ కావడంతో.. అదే స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ప్రభాకర్‌రావు చాకచక్యంగా సమాధానాలు చెప్పినట్లు సమాచారం.వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగింది. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. అయితే, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్‌రావు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. తాను ఎస్ఐబీలో పని చేసినప్పటికీ.. తనపైన ఇంకా అధికారులు ఉన్నారని, పై అధికారులకు తాను చేసిన ప్రతీ పని తెలుసునని, వారి నిరంతర పర్యవేక్షణలోనే తాను వర్క్ చేశానని చెప్పారు. ఉన్నతాధికారులకు తెలీకుండా తాను ఏ పని కూడా చేయలేదని సమాచారం.
- ప్రణీత్ రావ్, శ్రవణ్ రావుతో తరచు ఎందుకు భేటీ అయ్యేవారు..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు ప్రణీతరావును త్వరగా ప్రమోషన్ చేయాలని ఎవరు రికమెండ్ చేశారంటూ ఈ సందర్భంగా సిట్ ప్రశ్నించింది. అంతేకాకుండా మీరు, ప్రణీత్ రావ్, శ్రవణ్ రావు ముగ్గురు తరచుగా ఎందుకు భేటీ అయ్యేవారని, శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి అతనికి ఎస్ఐబీతో సంబంధాలే ఏంటని సిట్ పోలీసులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. కానీ, ప్రభాకర్‌రావు మాత్రం అసలు తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధమే లేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని ఇన్విస్టిగేషన్ ఆఫీసర్లనే ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.
- భారీగా బౌన్సర్లు.
ఎట్టకేలకు ఏడాది తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టగానే ఆయన నెట్‌వర్క్ అలర్ట్ అయ్యింది. అంతేకాదు ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. ఆయన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలో లేకపోయినా ప్రభాకర్‌రావు ఎయిర్‌పోర్టులో దిగగానే ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దాడి చేశారు. ఓ రిపోర్టర్‌ని చాతిలో గుద్దాడు బౌన్సర్. మరి కొంతమంది మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయంలో పోలీసులు బౌన్సర్లని హెచ్చరించినా మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కొందరు యూనిఫాంలో కనిపించగా, మరికొందరు సివిల్ డ్రెస్‌లో కనిపించారు బౌన్సర్లు. దాదాపు 70 మంది ప్రభాకర్‌రావు అనుచరులు ఒక్కసారిగా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభాకర్ రావు ఇంటివరకు బౌన్సర్లతో భారీ కాన్వాయ్ వచ్చింది. ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు బౌన్సర్లు. మీడియాతో మాట్లాడటానికి ముఖం చాటేశారు ప్రభాకర్‌రావు. ప్లాన్ ప్రకారం మీడియాపై దాడికి పాల్పడ్టారు ప్రభాకర్‌రావు బౌన్సర్లు. ఇక, మాజీ ఐపీఎస్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే ఆయనకు ఓ కస్టమ్స్ అధికారి వెల్ కమ్ చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ లెక్కన ఆయన నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ కేసులో నిందితుడికి కస్టమ్స్ అధికారి వెల్కమ్ చెప్పడాన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్వాగతం పలుకడంతో.. అందుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసులో నిందితుడికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధం. ఇమ్మి గ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేసింది. అయితే.. మే 29న ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని, ట్రావెల్ వీసా జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.విచారణకు హాజరయ్యేందుకు వీలు వీలు కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది.అయితే భారత్‌కు వచ్చేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్ వచ్చాక 3 రోజుల్లోగా హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని గతంలో హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్‌రావు. కానీ ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారాయన. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు.
- సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ లీకులు.
1. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు ?
2. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు ?
3. కేసు నమోదు అయిందనే సమాచారంతోనే విదేశాలకు పారీపోయారా?
4. మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వసం చేశారు?
5. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు.. మా దగ్గర స్టేట్మెంట్ ఉంది మీరేమంటారు?
6. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్‌ను ఎవరు చెపితే ఏర్పాటు చేశారు?
7. ఆ టీమ్‌ను గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా?
8. 4 వేలకు పైగా ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.. ఆ నెంబర్లు ఎవరు ఇచ్చారు?
9. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారు.. ఎందుకు?
10. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారు.. ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా?
11. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్‌లను, ఇతర ఆధారాలను ధ్వసం చేయాలని ముందే ప్లాన్ చేశారా?
12. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి, ఆధారాలను మాయం చేశారా?
13. శ్రవణ్ రావు ప్రయివేటు వ్యక్తి.. అతనితో ఎస్ఐబీకి ఏంటి సంబంధం?
14. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను సైతం ఎందుకు ట్యాప్ చేశారు? మీకు ఎవరైనా పెద్దలు ఆదేశాలు ఇచ్చారా?
15. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో.. కేవలం విపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి.. టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా?