ముద్ర, శేరిలింగంపల్లి:
రాయదుర్గం–టీ హబ్ మార్గంలో తొలి దశ స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదనలు
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పాదచారుల భద్రత కోసం, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్., నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది.
ఈ స్కైవాక్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా టీ హబ్ వరకు విస్తరించనుంది. ఐటీ కంపెనీలు, కార్యాలయాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. స్కైవాక్ నిర్మాణంతో వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు పాదచారులు ప్రమాదాలు లేకుండా రహదారి దాటే వీలు కలగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ సుమారు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టును ఎస్సీఎస్సీ సహకారంతో వివిధ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టనున్నాయి. తొలి దశలో సుమారు 500 మీటర్ల పొడవు గల స్కైవాక్‌ను నిర్మించనున్నారు. అలాగే టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీ–గేట్ వరకు సుమారు 400 మీటర్ల పొడవైన అండర్‌పాస్ టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్ఏ) ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) నుంచి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపనున్నారు. భవిష్యత్తులో ఈ స్కైవాక్‌ను ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ, టీజీఐఐసీ, ఐఏఎల్ఏ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించనున్నారు.
సీపీ వెంట కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఐపీఎస్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ కుమార్, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పవన్, ఎస్సీఎస్సీ సీఈవో నావెద్, రహేజా మైండ్ స్పేస్, సత్వ, దివ్యశ్రీ, ఫీనిక్స్ గ్రూప్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.