Take a fresh look at your lifestyle.

రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోందని పేర్కొన్నారు.
ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు అవి గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
రహదారులపై ధాన్యం అరబెట్టడం ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు రహదారులను వినియోగించకుండా, గ్రామ పంచాయతీ ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు లేదా రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.