Take a fresh look at your lifestyle.

మంత్రివర్గం నుంచి ‘ఒకరికి’ ఉద్వాసన..?

  • కొంపముంచిన వివాదాస్పద వ్యాఖ్యలు.
  • ఆమె స్ధానంలో అదే సామాజిక వర్గం నేత ‘ఆది’కి చోటు.
  • ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు బెర్త్ ఖరారు.
  • మక్తల్ ఎమ్మెల్యే వాకిటికీ వరించిన అమాత్య పదవి.
  • రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ లేదా సుదర్శన్ కు మంత్రి యోగం.
  • నాలుగు మంత్రి పదవులకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.
  • కొలిక్కి వచ్చిన మంత్రివర్గ విస్తరణ.
  • వచ్చే నెల మొదటివారంలో ముహూర్తం..?
  • మాల, మాదిగ నేతలకు ఈ సారి మొండిచెయ్యి
  • సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతోన్న సీఎం.
  • రాజగోపాల్ రెడ్డి వైపు ఏఐసీసీ మొగ్గు.
  • మాల, మాదిగల మధ్య విభేదాల కారణంతో పెండింగ్.
  • వివేక్ కు తప్పని నిరాశ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఊహించినట్టే జరిగింది. వివాదస్పద మంత్రిగా అపవాదు మూటగట్టుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ,అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర క్యాబినేట్ నుంచి ఉద్వాసన పలికేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. ఆమె స్ధానంలో అదే సామాజికవర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కేబినెట్ లో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా వరుస వివాదాల్లో నిలిచిన కారణంగానే కొండా సురేఖ మంత్రి పదవి కోల్పుతున్నారనే చర్చ పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వరంగల్‌లోని ఒక ప్రభుత్వ కళాశాలలో భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇతర మంత్రులు వారి శాఖలకు చెందిన ఫైళ్లను క్లియర్ చేయడానికి తరచుగా సంస్థల నుండి లంచాలు తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం కార్పొరేట్ల నుండి డబ్బు తీసుకోలేదని, బదులుగా వారు సమాజానికి తోడ్పడాలని కోరుకుంటున్నానని చెప్పడం దుమారాన్ని లేపింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా గతంలోనే ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు.నోరు జారిన ఆమె వ్యాఖ్యలను ఆధారంగా చేసుకున్న విపక్ష పార్టీ నేతలు అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. గతేడాది నటులు నాగ చైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి చేసిన ఆరోపణలపై వివాదం చెలరేగింది.ఆమె వాదనను అనుసరించి, ఆమెపై పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. అలాగే వేములవాడ రాజన్న కోడేల విక్రయం వివాదంలోనూ కొండా సురేఖ ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతేడాది ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి అప్పగించారు. మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కొండా సురేఖ సిఫార్సుతోనే రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి.

  • కొలిక్కి కేబినెట్​ విస్తరణ..!

ఊరిస్తోన్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది.టీపీసీసీ నేతలతో ఏడాదిన్నర కాలంగా తరుచూ సమీక్షలు సమావేశాలు నిర్వహించింది.అయితే సామాజిక సమీకరణాలు, పార్టీ అంశాలతో ఆయా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో పదవుల భర్తీ అంశం కొలిక్కి రాలేదు.అప్నటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ అంశం తాజాగా కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు పదవులు ఖాళీగా ఉంటే.. 17 మంది నేతలు మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు. దాంతో పార్టీ విధేయత, నియోజకవర్గ ప్రజల్లో ఉన్న ఆదరణ, ఇతర ఆరోపణలు, ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ ఆచితూచి పదవులు ఖరారు చేసింది.ఇందులో పలువురు కొత్త నేతలకు స్ధానం కల్పించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. ఆరుగురు సభ్యులకు అవకాశం ఉన్నప్పటికీ, ఈసారి నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే మంత్రివర్గంలో చేర్చించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాలలు, మాదిగల మధ్య విభేదాల కారణంగా రెండు పోస్టులు పెండింగ్ లో పెట్టింది. కాగా మంత్రి పదవులు వరించిన వారిలో ఒకరిని చీఫ్ విప్‌గా, మరొకరికి డిప్యూటీ స్పీకర్‌గా నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ పదవులు భర్తీ చేసి.. ప్రమాణస్వీకారం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ కు అధిష్టానం ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  • మైనార్టీ, ఎస్సీలకు ఇప్పట్లో నో ఛాన్స్​.

ప్రస్తుతం మంత్రి వర్గం రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి (బోధన్), ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), ఆది శ్రీనివాస్ (వేములవాడ), వాకాటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), విజయశాంతి (ఎమ్మెల్సీ)లు ఉన్నారు. ఇప్పటికే వీరు పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌కు ఛాన్స్ ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు కూడా మంత్రి రేసులో వినిపిస్తున్నది.అయితే వీరిలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరికి మంత్రివర్గంలో కచ్చితంగా చోటు కల్పిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తర్వాత ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం సైతం నిర్ణయం తీసుకున్నది.ఈ క్రమంలో ఈ దఫా వాకిటికి మంత్రివర్గంలో చేర్పించుకునేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరితే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ ఏకంగా రాహుల్ గాంధీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. దాంతో బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు కేబినెట్ లో స్ధానం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదనీ, ఈ క్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ముందు పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి (నలుగురు) ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతున్నది. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ లో చోటు కల్పించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. వీరితో పాటు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్(ధర్మపురి), మందుల సామెల్(తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), లక్ష్మీ కాంతారావు(జుక్కల్)హస్తినలో మకాం వేశారు. తమలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా పర్వాలేదని స్పష్టం చేశారు.కాగా మాల సామాజికవర్గానికి చెందిన వివేక్ సైతం మంత్రి పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మాల, మాదిగ నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఏఐసీసీ ఎస్సీ సామాజికవర్గానికి ఓ పదవిని రిజర్వ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.