- దేశ భద్రతపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు బాధ్యతారాహిత్యం.
- ఎన్ని యుద్ధ విమానాలు కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో అడగాల్సింది.
- ప్రపంచ దేశాల ముందు పాక్‌ను దోషిగా నిలబెడతాం.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ భక్తిని తక్కువ చేసి, సైనికులను అవమానించే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ సరిహద్దుల్లో సైనికులు చేసిన పోరాటాలను తక్కువ చేసి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఓ వితండ వాదం లేవనెత్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయం గురించి పాకిస్తాన్ పై మన సైనికులు ఎలా విరుచుకుపడ్డారో అనే అడిగి ఉంటే మన దేశం ప్రజలు, సైనికులు సంతోషపడేవారని అన్నారు. అలాకాకుండా ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో లెక్కచెప్పండని రాహుల్, రేవంత్ రెడ్డిలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ రక్షణకు సంబంధించి సున్నితమైన అంశాలపై ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ప్రతిపక్షనేతగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీలో బడేమియా రాహుల్ గాంధీ మాటలకు వత్తాసుగా ఇక్కడ హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి చోటోమియా కాపీపేస్ట్ ప్రశ్నలను సంధిస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చాశారు.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.. కనీస సోయి లేకుండా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశ భద్రతపై కాంగ్రెస్ నేతలు సంధిస్తున్న ప్రశ్నలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు. ప్రపంచ దేశాల ఎదుట పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం మన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ వచ్చి మూడు రోజలు పాటు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాసి, హైదారాబాద్ తిరిగి వెళ్ళాక రాహుల్ మాటలను వల్లె వేస్తూ.. సైనికులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్ళమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అసలు పాకిస్తాన్ కు పీవోకేను కట్టబెట్టిందెవరనే విషయం రేవంత్‌కు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. అసలు పీవోకేను భారత్ కోల్పోయేలా చేసింది కాంగ్రెస్ కాదా అని ఆయన నిలదీశారు. ఈ జన్మలో రాహుల్‌కు ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వందలాది ఉగ్రదాడులు జరిగాయన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఉగ్రదాడి జరిగేదని, ఎప్పుడైనా సైనికులకు స్వేచ్ఛ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కేవలం నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి చర్యలు తీసుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, కనీసం బయటకు ఏడవకుండా ఉంటే చాలని కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి హితవు పలికారు. దేశానికి ఏ విధంగా సేవ చేయాలో , ప్రపంచ దేశాలకు మనపై నమ్మకం, గౌరవం ఎలా పెంచాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసన్నారు. అసలు దేశం గురించి ఏ మాత్రం పట్టింపు, అవగాహన లేని రాహుల్ గాంధీ లాంటి వారు చెబితే వినే దుస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీలో, బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేసే వారికి ఉన్న క్రెడిట్ ఏంటి? అలాంటి వారి వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అదంతా డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ డ్రామా అని, ఫ్యామిలీ డ్రామా గురించి బీజేపీకి, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాదని ఆయన అన్నారు.