సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు..
పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..
నిధులు విడుదలకు ముఖ్యమంత్రి గారిని కలుస్తా..

జగిత్యాల:
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్సీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తోపాటు వివిధ శాఖల అధికారులు ఈవై ( EY) కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
2015 గోదావరి పుష్కరాలకు జగిత్యాల జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్ల వద్ద కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని ఈసారి 2027 గోదావరి పుష్కరాలకు 4 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంత్రి గారికి వివరించారు. అధికారులు తయారు చేసిన పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రి సూచించారు.
ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు బాసరా నుంచి భద్రాచలం వరకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని మంత్రి అన్నారు. ప్రస్తుతం అధికారులు జగిత్యాల జిల్లా లో చేపట్టే అభివృద్ధి పనులకు రూ. 940 కోట్లతో అంచనాలు తయారు చేశారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని పారిశుద్ధ్య పనులతో పాటు పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పుష్కరాల సందర్భంగా వీఐపీ భక్తుల లాగా సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రి అన్నారు. గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. గత పుష్కరాలు గతం కంటే భిన్నంగా అభివృద్ధి పనులు చేయాలని మంత్రి అన్నారు. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కనురెప్ప పాటు కరెంట్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
పుష్కరాల సమీక్ష సమావేశానికి హాజరు కాని పలువురు అధికారుల తీరుపై మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తానని మంత్రి తెలిపారు. మరో 10 రోజుల్లో పుష్కరాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు.