ముద్ర, ఇబ్రహీంపట్నం: వేగంగా వచ్చిన కారు బైకును ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగపల్లి సాగర్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు..నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య (27) అతని భార్య పిల్లలతో ఆగపల్లి నుండి ఇబ్రహీంపట్నం వైపు బైక్ (టీఎస్07హెచ్ జే3603)పై వస్తుండగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని గురునానక్ కాలేజ్ సమీపంలో సాగర్ హైవేపై నగరం నుండి అతివేగంగా వచ్చిన కారు (టీఎస్07హెచ్ వి0796) అదుపుతప్పి ఢీకొని సాగర్ రహదారి పక్కగా ఉన్న చెట్లపొదల్లోకి ఏడ్చుకెళ్ళింది.ఈ సంఘటనలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.అతని కుమార్తె 9 సంవత్సరాల అశ్విత కాలు విరుగగా..భార్య పార్వతమ్మ (26)కు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపడుతున్నట్లు మంచాల సీఐ మదు తెలిపారు.

