- హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఫైనల్స్.
- మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ.
- నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహా నగరం వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే (ఫైనల్స్) జరగనుంది. ”బ్యూటీ విత్ ఏ పర్పస్” అనే నినాదంతో జరుగుతున్న ఈ వేడుకలకు 109 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మందే తదుపరి దశకు చేరుకుంటాయి. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను తొలుత పిలుస్తారు. ఆ తర్వాత న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్ళిపోతారు. తర్వాత నుంచి ఫైనల్స్ మొదలవుతాయి. టాప్ 40 నుంచి తదుపరి రౌండ్‌కు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు తదితర అంశాలపై వీరిని ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారనేది అక్కడ ఉంటే న్యాయనిర్ధేతలు తేలుస్తారు. ఈ రకంగా ఎనిమిది మందిలో నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారనే అఖరి ప్రశ్ని వీరిని అడుగుతారు.వారిచ్చే సమాధాం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయమవుతుంది. విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో పాటు మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేయడంతో గ్రాండ్ ఫినాలే వేడుకలు ముగుస్తాయి.
- వీరే న్యాయనిర్ణేతలు.
72వ మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్, బారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హెస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ తారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్‌లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ మానవతావాది, సీనియర్ నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సోనూ సూద్ ఫైనల్స్‌కు న్యాయ నిర్దేతగా కూడా వ్యవహరించనున్నారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కరినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014) , మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ ఉన్నారు. అలాగే మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. కాగా, మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారత దేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ కానుంది. కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం చేయనున్నారు.
- మిల్లా మాగీపై లండన్‌లో కేసు.
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణల వ్యవహారంలో విచారణ పూర్తి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. వివాదాస్పదమైన కామెంట్లు చేసిన మిల్లా మాగీపై మిస్ వరల్డ్ 2025 నిర్వహకులు లండన్ కోర్టులో కేసు వేశారని, ఆమెపై యూకే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోబోతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజైన జూన్ 2న రాజ్ భవన్‌లో తేనీటి విందు ఉంటుందని, దానిలో కొత్త మిస్ వరల్డ్ పాల్గొంటారని ఆయన తెలిపారు. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు టూరిజం వెబ్ సైట్ ద్వారా వెయ్యి మంది సామాన్య ప్రతినిధులను కూడా ఆహ్వానించామని ఆయన వెల్లడించారు.

