మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ
సైలెంట్ మోడ్ లో బీఆర్ఎస్
ప్రచారం ప్రారంభించిన సీఎం
ఢిల్లీ నుంచి దిగిన బీజేపీ చీఫ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒక్క వారమే గడువు. నామినేషన్ల పర్వం అలా ముగిసిందో.. లేదో.. అధికార పార్టీ రంగంలోకి దిగింది. అదే బాటలో బీజేపీ మొదలుపెట్టింది. స్థానిక నేతలు కాకుండా ఢిల్లీ నుంచి కాషాయ దళపతి రాష్ట్రానికి వచ్చారు. ఈ ఎన్నికలు కీలకంగా మారడంతో.. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బరిలోకి దిగారు. కానీ బీఆర్ఎస్ మాత్రం లైట్ తీసుకుంటోంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అగ్రనేతలను రంగంలోకి దించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం స్థానిక నేతలకే బాధ్యత వదిలేసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ తన పాలనకు ఒక రెఫరెండంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. కేడర్‌లో ఉత్సాహం నింపేలా ప్రతి మున్సిపాలిటీకి మంత్రులను ఇన్-ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యేవేక్షిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రచారం మొదలుపెట్టారు.
ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
బీజేపీ సైతం ఏమాత్రం తగ్గడం లేదు. జాతీయ అధ్యక్షుడు స్వయంగా ప్రచారానికి వస్తుండటమే కాకుండా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. వీటికి అదనంగా, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లను, యువత ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్నది బీజేపీ వ్యూహం. ఇంతటి భారీ యంత్రాంగాన్ని దింపడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఆ పార్టీ పంపిస్తోంది.
పట్టించుకోని బీఆర్ఎస్
ఈ హడావుడి మధ్య బీఆర్ఎస్ తీరు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ప్రతి చిన్న ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ, క్షేత్రస్థాయి ప్రచార బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జులకే వదిలేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా వారికే ఇచ్చారు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది.
తేడా వస్తే బాధ్యత తీసుకోకుండానేనా?
బీఆర్ఎస్ ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే, ఆ ఓటమి బాధ్యతను తమపై వేసుకోకుండా తప్పించుకోవడానికే అగ్రనేతలు దూరంగా ఉంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా.. ఫలితాలు బాగుంటే పార్టీ పుంజుకుందన్న ప్రచారం, తేడా వస్తే స్థానిక నేతల వైఫల్యంగా చూపించే వీలుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇది కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్సివ్ మోడ్‌లో కనిపిస్తోంది.
సవాళ్లు.. ప్రతి సవాళ్లు
మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాల్‌లతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా అభివర్ణించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పాలనపై రెఫరెండం గా స్వీకరిద్దామని సవాల్ విసిరారు. మరోవైపు, పట్టణ ఓటర్లపై గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
అధికార బలమే ప్లస్.. వ్యతిరేకతే మైనస్
ప్రస్తుతం అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, పెంచిన పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ ప్రాంత పేదలను ఆకట్టుకుంటాయని పార్టీ భావిస్తోంది. మంత్రి పొంగులేటి రెఫరెండం సవాల్ విసిరారంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు. అయితే, రైతు భరోసా పంపిణీలో జాప్యం, పట్టణాల్లో అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు పట్టణ మధ్యతరగతి ఓటర్లలో కొంత వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా మారుతుంది.
ఉనికి కోసమే పోరాటం
కేటీఆర్ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా పేర్కొనడం వెనుక వ్యూహం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటములతో డీలా పడ్డ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే ఈ విజయం వారికి అనివార్యం. కేసీఆర్ హయాంలో జరిగిన పట్టణాభివృద్ధి, ఐటీ పురోగతి తమకు ప్లస్ అవుతాయని గులాబీ దళం ఆశిస్తోంది. అయితే, పార్టీ నుంచి కీలక నేతలు వలస వెళ్లడం, హైకమాండ్ లోపల కుటుంబ విబేధాలు బహిర్గతం కావడం ఈ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్లు. ఈ ఎన్నికల్లో కూడా వెనుకబడితే, పార్టీ భవిష్యత్తు మరింత ఇరకాటంలో పడుతుంది.
పట్టణ ఓటు బ్యాంకే కొండంత అండ
తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో సహజంగానే బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రధాన నగరాల్లో హిందూత్వ కార్డు , కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. మున్సిపాలిటీల్లో తమదే మెజార్టీ అని బండి సంజయ్, కిషన్ రెడ్డి ధీమాగా ఉండటానికి కారణం ఇదే. అయితే, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం, జనసేన వంటి మిత్రపక్షం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవడం బీజేపీకి మైనస్ కావచ్చు.
ఏం తేలుతోంది..?
ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదని తేలిపోతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పుంజుకుంటే, కేసీఆర్ మార్క్ రాజకీయం ఇంకా ఉనికిలో ఉందని అర్థమవుతుంది. బీజేపీ గెలిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తామే ప్రత్యామ్నాయమని ఢిల్లీకి సంకేతం పంపినట్లవుతుంది. ఫలితాలు తారుమారైతే, ఓడిన పార్టీల నుంచి వలసలు మరింత పెరిగి, ఆయా పార్టీల్లో తీవ్ర నీరసం ఆవరించే ప్రమాదం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తెలంగాణలో రాబోయే రాజకీయ దిశను నిర్దేశించే అతిపెద్ద పోలింగ్ రెఫరెండం గా మారబోతున్నాయి.