ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ డిస్మిస్ చేస్తా అన్నారు..జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సభలో మంత్రి అడ్లూరి..
నేడు ఆర్టీసీ సమ్మెను పరిష్కారించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు..
మూడు రోజుల్లోనే సమ్మెకు ముగింపు పలికాం.. పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా చర్యలు తీసుకున్నాం..
త్వరలో జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్స్ లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారితో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని గత ప్రభుత్వంలో పెద్దగా ఉన్న పాపాల భైరవుడు కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెల మొదటి వారంలో రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో దాన్యం కొనుగోలులో రైతులను అనేక ఇబ్బందులు పెట్టేవారని తప్ప, తాలు పేరుతో అధిక తూకం వేసి రైతులను ఇబ్బంది పెట్టారని మంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అధికారులను బాధ్యులను మరియు భాగస్వాములను చేస్తూ కొనుగోలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకొని మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. రైతు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
జగిత్యాల జిల్లాలోని సమస్యలను ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగిందని మే 20వ తేదీ నుండి జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం..
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాము రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. జగిత్యాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గతంలో ఆర్టీసీ కార్మికుడు న్యాయం జరిగిందని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని వారు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రి గారికి జేఏసీ హామీ ఇచ్చారు.
వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆయిల్ ఫాం పంటకు మంచి డిమాండ్ ఉందని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా నిధులు తీసుకోవచ్చి మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు చేస్తూ అధిక లాభాలు సాధించడానికి వాణిజ్య పంటలు సాగు చేయాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించడానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు తప్ప తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని దినేష్ అన్నారు.
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన పాలకవర్గం రైతులకు మద్దతు ధర అందించడానికి కృషి చేయాలని, దళారుల నుంచి రైతులను కాపాడాలని అన్నారు.
జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ లో రైతులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.