Take a fresh look at your lifestyle.

నాంపల్లి ప్రమాదంలో 1100 ఫైళ్లు దగ్గం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాద నాగ్ పూర్ స్పెషల్ టీమ్ ప్రకటన
సాంకేతిక ఆధారాలు సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధం
‘ఫోన్ ట్యాపింగ్’శాస్త్రీయ ఆధారాలూ దగ్గం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది. మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించినట్టు పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్ ను రికవరీకి ప్రయత్నించామని, డేటా రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చే చెప్పింది. ఈ నెల 7న నాంపల్లిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ లాబొరేటరీ భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో మెుత్తం 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు తమ రిపోర్టులో వెల్లడించింది. దగ్ధమైన ఫైల్స్‌లో ఒక కీలక కేసుకు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఈ ప్రమాదంలో కాలి బూడిదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఎఫ్ఎస్‌ఎల్ ల్యాబ్ సహాయం అందిస్తుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇక్కడే ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్, బ్లడ్, హెయిర్, డీఎన్ఏ టెస్టులు, తుపాకులు, బుల్లెట్లతో పాటు విషాలు, మత్తుపదార్థాలు, గంజాయి, డ్రగ్స్, సంతకాలు, నకిలీపత్రాల పరిశీలన ఇక్కడే చేస్తారు. కాగా దగ్ధమైన ఫైల్స్ లో ఏమేమి ఉన్నాయన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.