డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మెదక్ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్లలో చూపు సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చూపు సమస్యల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి డ్రైవర్ నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు తప్పనిసరిగా ప్రమాణిత హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు.
మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎఆర్ డీఎస్పీ రంగానాథ్, సీఐలు జార్జ్, మహేష్, కృష్ణమూర్తి, ఆర్ఐ రామకృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.