Take a fresh look at your lifestyle.

మహిళా సంఘాలతో మహిళల సమగ్రాభివృద్ధి

  • ఎం ఎల్ ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో మహిళల సమగ్ర అభివృద్ధికి మహిళా సంఘాలు ప్రధాన వేదికగా మారాయని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు.స్థానిక పెన్షనర్ల భవనంలోశుక్రవారం సాయంత్రం  నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళ సంఘాల్లో చేరేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో 12,043 మహిళా సంఘాలు పనిచేస్తున్నాయని, వీటిలో 1,39,361 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 4,986 మహిళా సంఘాల ద్వారా 57,908 మంది సభ్యులు ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 816 సంఘాలకు రూ.74.40 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని 282 సంఘాలకు రూ.27.86 కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. అంతేగాక, గత సంవత్సరానికి సంబంధించి 29,676 మహిళా సంఘాలకు రూ.34.28 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు, కుట్టు మిషన్ల ద్వారా యూనిఫామ్ తయారీ వంటి కార్యక్రమాల్లో మహిళా సంఘాలు చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. మహిళా సంఘాల కోసం రెండు సోలార్ ప్లాంట్లకు మంజూరైన రూ.3 కోట్ల నిధుల వివరాలు వెల్లడించారు. అనంతరం 24 మంది లబ్ధిదారులకు రూ.16.97 లక్షల విలువైన చెక్కులను, మరో 10 లక్షల విలువైన ప్రమాద భీమా చెక్కును శాసనసభ్యులు, అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ ప్రగతిని సాధించిన మహిళా సంఘాల సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు మహిళా సాధికారతపై ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ కృష్ణకుమార్, ఇన్‌చార్జి డీఆర్డీఓ శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, అధికారులు, సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.