- మెట్ పల్లి ఏ డీ ఈ మనోహర్.
మెట్ పల్లి, ముద్ర: వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతున్నదని కావున రైతులు నీటిని పంటలకు అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలని, ఆటో స్టార్టర్లతో వృథా చేయరాదని మెట్ పల్లి ఏడీఈ మనోహర్ ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు.మరో రెండు వారాల్లో వరి పంట కోతదశకు చేరుకోనుందని ఎవరైనా రైతులు ఆటో స్టార్టర్లను వినియోగించి అవసరానికి మించి నీటిని తోడడం వలన నీరు వృధాగా కాలువల్లో, వాగుల్లో పడిపోవడం వల్ల అనవసరంగా నీటితో పాటు విద్యుత్ కూడా వృధా అవుతుందని దానివల్ల భూగర్భ జలమట్టాలు కూడా అడుగంటి పోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియతో అవసరం ఉన్న రైతులకు నీరు అందకుండా పోతుందని,వారి పంటల పట్ల కూడా సామాజిక బాధ్యత వహించాలని రైతులకు మనవి చేశారు.ఏ ఒక్కరూ కూడా ఆటో స్టార్టర్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.మెట్టుపల్లి మరియు మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 32 వేల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు నడుస్తున్నాయని వాటికి నిరంతర ఉచిత విద్యుత్తు ప్రతిరోజు 11.22 లక్షల యూనిట్లు సరఫరా జరుగుతుందని తెలిపారు.28 సబ్స్టేషన్ లు, 122 11కెవి ఫీడర్లు, 5 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ల ద్వారా నాణ్యమైన విద్యుత్ అందించుట కొరకు సిబ్బంది ఎల్లవేళలా వినియోగదారులకు అందుబాటులో ఉండి కృషి చేస్తున్నారని, ఏదైనా సరఫరాలో లోపం తలెత్తితే 1912 కు కాల్ చేయాలని సూచించారు.కావున రైతు సోదరులు పంటలు పూర్తిస్థాయిలో చేతికి అందేంతవరకు అప్రమత్తంగా ఉండాలని నీటిని, విద్యుత్ ను వృధా చేయకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని, భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.