- అదే మా ప్రభుత్వ లక్ష్యం.
- ఎడ్యుకేషన్ ఎక్స్ పో -2025లో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో “ఎడ్యుకేషన్ ఎక్స్ పో – 2025″ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, దాన్ని తిరిగి గాడిలో పెట్టి అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి అప్పుడూ ఇప్పుడూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేసిందన్నారు. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు 1991 – 1992 లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ వైపు సర్కార్ బడులను బలోపేతం చేస్తూనే… మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించిందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సర్కార్ బడులను తీర్చి దిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.తెలంగాణ యువత ప్రతిభే మనకు పెద్ద ఆస్తి అని, అందుకే ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏటా 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంటున్నారని, కానీ వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండటం లేదన్నారు.ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు.నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దాలని, అందుకోసం “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ”తో భాగస్వామ్యం కావాలని కోరారు.
