గర్భిణీలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు – కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరిక
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీలు మరియు శిశువుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

శనివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో PC & PNDT చట్టం 1994 మరియు నిబంధనలు 1996పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు కీలక సూచనలు చేశారు.
గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా నెలవారీ ఆరోగ్య పరీక్షలకు హాజరవ్వాలని, హాజరు కాకపోతే కారణాలు తెలుసుకోవాలని ఏఎన్ఎంలకు సూచించారు. ముఖ్యంగా హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షలు, మందులు, పోషకాహార సూచనలు అందించాలని ఆదేశించారు.
మాతృ మరియు శిశు మరణాలను తగ్గించడంలో ముందస్తు జాగ్రత్తలు కీలకమని పేర్కొంటూ, గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు గర్భిణీలతో నిరంతరం సంబంధం కొనసాగించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో వెంటనే ఆసుపత్రులకు తరలించే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా, 1వ, 2వ, 3వ గర్భస్థ పరీక్షల తర్వాత నెలవారీ చెకప్‌లకు హాజరుకాని గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అబార్షన్ జరిగిన అనుమానాలపై కూడా పరిశీలన చేయాలని ఆదేశించారు. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండో గర్భంపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు లేదా అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి సమాచారం తెలిసిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఏఎన్ఎంలకు సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం 1000 మంది బాలురకు కేవలం 894 మంది బాలికలే ఉన్నారని పేర్కొంటూ, ఈ అసమానత కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల సంరక్షణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, మాతృ-శిశు మరణాలు జరగకుండా వైద్యాధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ తారా సింగ్, భీమ్లా నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.