ముద్ర ప్రతినిధి, నిర్మల్: మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.కొండాపూర్ సమీపంలో నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు,క్రిడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయాలను సాధించాలన్నారు.క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో మాహిళలు సమాన హక్కులు పొందాలని,క్రీడల్లోనూ వారిది విశేషమైన స్థానం అని అన్నారు.ఆరోగ్యంగా,ఆనందంగా జీవించేందుకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని,మహిళా శక్తిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మహిళలతో కలిసి చెస్, క్యారం,టెన్నిస్ ఆటలను ఆడారు.వివిధ క్రీడా విభాగాల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి,జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి,డి ఆర్ డి ఓ విజయలక్ష్మి,జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు,మహిళలు,నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్స్ నందకుమార్, పోతన్న, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.