Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి శాఖ తమకు సంబంధించిన పథకాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.

సభలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా షామియానాలు ఏర్పాటు చేయాలని డిపిఓ శ్రీరాములను ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, గర్భిణులు, చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.

విద్యాశాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, వ్యవసాయ శాఖ రైతులకు లాభదాయక పంటలు, ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సభలకు సమయానికి హాజరై స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో డిపిఓ శ్రీరాములు, డిఆర్డిఎ పీడీ చిన్న ఓబులేష్, డీఈఓ రమేష్ కుమార్, డిటిఓ చిన్న బాలు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.