ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభిస్తోందని ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి తెలిపారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా ఇప్పటి వరకు 2600 పైచిలుకు మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
అందులో ఇప్పటికే 1800 మందికి స్క్రీనింగ్ నిర్వహించి టోకెన్ కేటాయింపు చేయడం జరిగిందని నేడు వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారని చెప్పారు.
ఈ మెగా జాబ్ మేళాతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కుంభం ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు.