ముద్ర ప్రతినిధి:
తమిళనాడు లౌకికవాదానికి కోటగా నిలిచిందని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని బలపరచాలని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తమిళ ప్రజలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సమీపంలోని సింగనల్లూర్ నుంచి కవుండంపాలెం వరకు రోడ్‌షోలో పాల్గొన్న ఆయన, అనంతరం శివకాశిలో జరిగిన ప్రచార సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడులో విభజన రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేసిన ఆయన, బీజేపీకి ఇక్కడ ప్రవేశం ఉండకూడదని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 21 పార్టీలతో ఏర్పడిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ గ్రామీణ స్థాయి వరకు విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు.
దేశ ప్రజలు భవిష్యత్ ప్రధాని గా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆశిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. శివకాశి నియోజకవర్గంలో డీఎంకే మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జీ. అశోకన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ కూటమి ఏర్పడిందని స్పష్టం చేసిన మంత్రి, మహిళా సాధికారతకు కూటమి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆయన, కూటమి అధికారంలోకి వస్తే 300 రోజుల్లో 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే రాష్ట్ర పోలీసు శాఖలో 10 వేల మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ప్రస్తుతం మహిళలకు అందిస్తున్న రూ.1000 ఆర్థిక సహాయాన్ని రూ.2000కు పెంచి నెలవారీగా అందిస్తామని తెలిపారు. ప్రజల స్పందనను బట్టి చూస్తే మరోసారి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే–కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.