Take a fresh look at your lifestyle.

టైఫాయిడ్ విలయతాండవం

డెత్ రిపోర్ట్
జ్వరం.. జాగ్రత్త
 
దేశంలో ప్రతీ 5 మరణాల్లో ఒకటి మన రాష్ట్రంలోనే..!
ఏటేటా మరణాలు నమోదు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
టైఫాయిడ్ మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దేశంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు విడిచే ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు అని నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలో మొత్తం 1,075 మంది టైఫాయిడ్ కారణంగా చనిపోగా.. అందులో 202 మరణాలు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌కు సంబంధించిన గణాంకాలు.. తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో నమోదు అవుతున్న ప్రతీ 5 మరణాల్లో ఒకటి తెలంగాణ నుంచే ఉందని తాజాగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. 2023లో టైఫాయిడ్ బారినపడి 202 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలోని అన్ని టైఫాయిడ్ మరణాల్లో 19 శాతం తెలంగాణ నుంచి ఉన్నట్లు ఆ రిపోర్ట్ చెబుతోంది. టైఫాయిడ్ వ్యాప్తికి ప్రధాన కారణాలు.. కలుషితమైన ఆహారం, నీరు, పారిశుద్ధ్య సమస్యలు అని నిపుణులు చెబుతున్నారు. అయితే టైఫాయిడ్ బారిన పడ్డ వారికి.. చికిత్సలో ఆలస్యం చేయడం వల్ల పేగులు దెబ్బతినడం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది.

ఇదీ డెత్ రిపోర్ట్
2023కు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా మొత్తం 1,075 మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక భారతదేశంలోనే రెండో అత్యధికంగా 202 మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక 377 మరణాలతో మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్ ఉంది. అయితే దేశంలోని జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.5 శాతం మాత్రమే కాగా.. టైఫాయిడ్ సంబంధిత మరణాల్లో మాత్రం 19 శాతం వాటాను కలిగి ఉండటం.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుపుతోంది. మూడో స్థానంలో 118 మరణాలతో పంజాబ్.. 36 మరణాలతో ఢిల్లీ నాలుగో స్థానాల్లో నిలిచాయి.

టైఫాయిడ్ వ్యాప్తికి కారణాలు
సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ సోకుతుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అపరిశుభ్రమైన నీరు.. పైపులైన్లు వేసేటపుడు, మరమ్మతుల సమయంలో అందులో మురుగునీరు కలిస్తే.. వాటిని తాగడం వల్ల ఈ టైఫాయిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. పరిశుభ్రత లేకుండా తయారు చేసే స్ట్రీట్ ఫుడ్, దాని తయారీలో ఉపయోగించే కలుషితమైన నీటిని వాడటం వల్ల.. ఎక్కువగా ఈ టైఫాయిడ్ బారిన పడుతున్నారు. నగరాల్లో నాలాలు, రోడ్లపై మురుగునీరు పొర్లడం, మురికివాడల్లో వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే టైఫాయిడ్ సోకిన చాలామంది.. దాన్ని ఒక సాధారణ జ్వరం అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. మరికొందరు సొంతంగా మెడిసిన్ వేసుకుని తగ్గించుకుందామనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి నిర్ణయాల వల్లే వారి పరిస్థితి విషమించి ప్రాణాల మీదికి తెస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే.. ఈ టైఫాయిడ్ వల్ల పేగులకు రంధ్రాలు పడటం, రక్తంలో ఇన్ఫెక్షన్ రావడం, అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సరైన సమయంలో సరైన మెడిసిన్ వాడకపోవడం, సాధారణ యాంటీబయాటిక్స్ పని చేయకపోవడం టైఫాయిడ్ రోగులకు మరో పెద్ద సవాలుగా మారిందని డాక్టర్లు తెలిపారు.
నిపుణుల సూచించిన వివరాల ప్రకారం.. నీటిని కాచి చల్లార్చి తాగడం.. వేడి వేడి ఆహారాన్ని తినడం, జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల మరణాలను అరికట్టవచ్చని చెబుతున్నారు. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి అక్కడ పారిశుద్ధ్య చర్యలను పూర్తిగా చేపట్టాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.