ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో శనివారం వరకు మొత్తం 2.85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుందని, ఇందులో సుమారు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తేమ (Moisture) పరిమితులకు అనుగుణంగా నమోదైందన్నారు. ఇందులో ఇప్పటివరకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు సరఫరా చేయడం జరిగింది. ఇందుకుగాను 14,544 మంది రైతులకు నేరుగా రూ.260 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వివరించారు. ప్రతిరోజూ సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 500 పైచిలుకు లారీల ద్వారా కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వేగవంతంగా సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 93 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ధాన్యం దిగుమతి వేగవంతం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలు ఇంకా సుమారు 15 రోజులలో ముగింపు దశకు చేరుకోనున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.