- ఇంత పెద్దమొత్తంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- ఈ ఏడాది రూ. 22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
- శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికేట్ల అందజేత.
- రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర,తెలంగాణ బ్యూరో: భారతదేశంలో పేదలకు రూ. 5 లక్షలతో సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పధకానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఈ ఏడాది రూ. 22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని ఇందుకు సంబంధించి మరికొద్దిరోజుల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తామని ఇప్పటికే పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు.హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ లో నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ( న్యాక్) లో ఆరు రోజుల పాటు శిక్షణ పొందారు. శనివారం నాడు న్యాక్‌లో శిక్షణ పొందిన ఇంజనీర్లకు మంత్రి సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ నిబద్దతతో పనిచేసి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఇంజనీర్లకు విజ్ఞప్తి చేశారు.ఎంపికైన 350 మంది ఇంజనీర్లలో 45 శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా కూడా మెరిట్ పద్దతిలోనే ఎంపిక చేయడం జరిగిందన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ సంక్షేమ పధకం కింద ఒక్క లబ్దిదారునికి రూ. 5 లక్షలు ఇస్తున్న పధకం లేదని అన్నారు. ఇండ్ల పధకాల్లో కూడా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షలతో 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పధకాన్ని రూపొందించిందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం కొద్దిరోజుల్లోనే నాలుగు లక్షల మంది జాబితా ఫైనల్ చేయబోతున్నామని విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, వత్తిళ్లకు గురికాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా క్షేత్రస్ధాయిలో పనిచేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో ఎలాంటి మధ్యవర్తులు ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్నలబ్గిదారులకు ప్రతిసోమవారం చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.నిర్మాణ రంగంలో తనకు ఉన్న అనుభవంతో తక్కువ ఖర్చు, నాణ్యతతో ఇండ్లను నిర్మించడానికి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని యువ ఇంజనీర్లు కూడా ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
- పదోన్నతులు పొందిన 21 మందికి సర్టిఫికేట్లు అందజేత.
స్టాంప్స్ అంజ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులు పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించారు.వీరికి మంత్రి పదోన్నతి పొందిన సర్టిఫికేట్లను అందజేశారు.