Take a fresh look at your lifestyle.

సమ్మె దిశగా ఆర్టీసీ!

  • స్పష్టత ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు.
  • మంత్రి పొన్నంతో భేటీ అయినా దక్కని ఫలితం.
  • కార్మిక సమస్యలపై సంఘాలతో చర్చించని సర్కార్​.
  • ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు భారీ ర్యాలీ.
  • బస్ భవన్ వద్ద భద్రత పెంపు.
  • ఆర్టీసీ యాజమాన్యం స్పందనపై సర్వత్రా ఉత్కంఠ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీజీ ఆర్టీసీని సమ్మె మేఘాలు అలుముకున్నాయి. దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు నేడు సమరశంఖం పూరించనున్నారు.ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగా లేవనీ సమ్మె విషయంలో పునరాలోచన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఇటీవల కార్మికులకు సూచించారు.ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోతుందన్నారు.సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.ఈ నెల 5, 6 తేదిల్లో ఎప్పుడైనా కార్మిక సంఘ నేతలు తనను వచ్చి కలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ప్రకటన చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం చర్చలు జరగలేదు. సోమవారం మంత్రి పొన్నం ను ఆయన నివాసంలో కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు సమస్యలపై చర్చించినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బాగా లేదని డిమాండ్లు పూర్తి చేయాలంటే ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని మంత్రి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.అయితే ఈ భేటీలో ఆర్టీసీ యాజమన్యం లేకపోవడం మంత్రి స్పందన కూడా సరిగా లేకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి.ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కార్మికులు నగరంలో కవాతు నిర్వహించారు.హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనున్న బస్ భవన్‌ను ముట్టడించారు.దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.సమ్మె నేపథ్యంలో తమతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం పిలవకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సమ్మె యధా విధిగా కొనసాగుతోందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.మంగళవారం అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోతాయని కార్మిక సంఘ నేతలు చెప్పారు.తమ సమ్మెకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాగా కార్మికుల కవాతు నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విధంగా సమ్మెకు నేడు ఒక్క రోజే మిగిలి ఉండగా.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.