- రాష్ట్ర ఆదాయం రూ.18,500 కోట్లు.. ఖర్చులు రూ.22,500 కోట్లు.
- ఏ పథకం ఆపాలో మీరే చెప్పండి.
- ప్రభుత్వ ఉద్యోగుల సమరం ఎవరిపై..?
- మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు.
- జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పలేదేం..?
- ఉద్యోగులు అడగకుండానే జీతాలిచ్చాం.
- గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్ ఏజ్ పెంచారు.
- మీరు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారు.
- సమ్మెలు, ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
- రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారొద్దు.
- రాష్ట్రాన్ని మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు.
- తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సమ్మెకు సిద్ధమవుతోన్న ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వంపైనా లేక 97శాతం మంది రాష్ట్ర ప్రజలపైనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు సిద్ధమవుతోన్న ఉద్యోగ సంఘాలు ఆ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు.ప్రస్తుతం తనను కోసుకోని తిన్నా చిల్లిగవ్వ రాదని స్పష్టం చేశారు.ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటే ఎక్కడా అప్పులు పుట్టడం లేదన్నారు.రాష్ట్ర ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులను చూసి కూడా సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మెకు సిద్ధమవడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. నెలకు రాష్ట్రానికి రూ.18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదన్న సీఎం ఖర్చులు మాత్రం రూ.22,500 కోట్లు అవసరముంటున్నాయని చెప్పారు.అయినా మీ డిమాండ్లు నెరవేర్చాలంటే ప్రస్తుతం కొనసాగుతోన్న ఏ పథకం నిలిపివేయాలో చెప్పాలని ఉద్యోగులకు సూచించారు.వరి ధాన్యానికి ఇస్తోన్న రూ. 500 బోనస్ తీసేద్దామా ? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు సమయానికి రానప్పుడు కనీసం నోరు విప్పారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత జీతాలు రావడం లేదని ఎవరూ అడగకుండానే వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఉద్యోగ సంఘ నేతలను ఉద్దేశించి చెప్పారు.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవచేయడానికేననీ, సమరానికి కాదన్నారు.ఇప్పుడు కావాల్సింది సమరం కాదన్న రేవంత్ రెడ్డి సమయస్ఫూర్తి, సంయమనం అవసరమని చెప్పారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీసులకు “రియల్ హీరోస్ జీ అవార్డ్స్-2025” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏదైనా సమస్య ఉంటే వాటిని ఆలకించి సమస్యకు పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడిన వారు ఎవరూ లేరన్నారు.ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని ఉద్యోగ సంఘ నేతలపై మండిపడ్డారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని సూచించారు. ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు.అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు కానీ తాము ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టడంలేదని తేల్చి చెప్పారు.ఈ సమస్య నుంచి గట్టేక్కాలంటే స్వీయ నియంత్రణనే పరిష్కారమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబమన్న సీఎం సమ్మెకు దిగి కుటుంబ పరువును బజారున పడేయొద్దని హితవుపలికారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రతీ నెలా రూ. 7వేల కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు.బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన కొన్ని రాజకీయ పార్టీలు ఆ బకాయిల గురించి ఆరోపణలు చేస్తున్నాయన్నారు.ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు, విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి, ప్రాజెక్టులు కట్టామని చెప్పి కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. దీనికన్నా దుర్మార్గం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పడు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.తాము అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ. 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశామన్నారు.బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు గత ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచిందన్నారు.ఉద్యోగులు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టిందన్నారు. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారి ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవొద్దని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక స్ధితి కేంద్రానికి బాగా తెలుసన్నారు.సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కోసం నిధులు కోరేందుకు ఢిల్లీకి వెళ్తే ప్రధాని, కేంద్రమంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.బ్యాంకులు సైతం తమను దొంగల్లా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రోడ్లు వేయాలన్నా ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేదన్నారు.కాంట్రాక్టర్లకు అప్పుల బకాయిలు రూ.వెయ్యి కోట్లు కూడాఇవ్వలేక పోతున్నామన్నారు.ఓ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎలా ఉంటుందో మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి అలాగే ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామృష్ణ, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
