- ఆయిల్ పామ్ పంట సాగుఫై రైతులు దృష్టి సారించాలి.
- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు పండించే వరి నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని, కూలీల కొరత అధికంగా ఉందని, వరికి వచ్చే చీడపీడల సమస్య ఎక్కవగా ఉండడం వల్ల లాభసాటి పంటలు పండించాలని, ఆయిల్ పామ్ పంట నే దానికి ప్రత్యామ్నాయమని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ లో అరటి, బొప్పాయి, వక్క, కోకో వంటి అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని, ఈ సంవత్సరంలో 3750 ఎకరాలలో ఆయిల్ పామ్ నాటే లక్ష్యం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఆయిల్ పామ్ పైఅవగాహన పెంపొందించడానికి లోహియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డిహెచ్ ఎస్ ఓ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు వస్తుందని తెలిపారు. మొక్కలను 90శాతం సబ్సిడీ పై రూ. 20 కే ఇస్తున్నామని, డ్రిప్ పై 80 -100 శాతం సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ . 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. డిఎఓ భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 30 సంవత్సరాల నుండి ఆయిల్ పామ్ సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారని, ఇక్కడి రైతులు కూడా వరి విస్తీర్ణన్ని తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేయాలనీ సూచించారు. లోహియా సిఇఓ సిద్ధాంత్ లోహియా మాట్లాడుతూ యశ్వంతరావు పేట గ్రామంలో సెప్టెంబర్ 4 న ఫ్యాక్టరీ శంకస్థాపన చేస్తున్నామని, ప్రతి రైతు ను బంగారు రైతుగా చేసే దిశగా కంపెనీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఎల్ డి యం మాట్లాడుతూ ఆయిల్ పామ్ పెట్టె రైతులకు ఎకరానికి రూ. 50 వేల టర్మ్ లోన్ ఇస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న ఆదర్శ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, అర్దిఒ మధుసూదన్ గౌడ్, ప్రదీప్ పట్నాయక్, ఎడిఎ తిరుపతి నాయక్, ఉద్యాన అధికారులు,రైతులు పాల్గొన్నారు.
