Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కాంగ్రెస్ భక్షక పాలన-మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

దళితులు, పేదల భూములపై సర్కార్ దండయాత్ర
వికారాబాద్, భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు సీఎం నజర్
ఇండస్ట్రియల్ పార్కుల పేరిట నోటిఫికేషన్లు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం

పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల పరామర్శ అడ్డగింత, హౌస్ అరెస్ట్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో నడుస్తున్నది ‘ప్రజాపాలన’ కాదనీ ‘భక్షక పాలన’ అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన వికారాబాద్, భువనగిరిలో ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు ఉంటే, అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అంటూ నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఆయా ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయన బయటకు రాకుండా అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. దళితులు, పేద వర్గాల భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దండయాత్ర చేస్తోందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, ప్రశ్నించే హక్కు అని మాట్లాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న కళ్లాపూర్ వద్ద టెంట్లను పీకేయడం, మహిళలను అరెస్టు చేయడం దారుణమన్నారు. నాడు ఇందిరమ్మ పంపిణీ చేసిన భూములను, నేటి ఇందిరమ్మ పాలనలో గద్దల్లా వాలి లాక్కోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టూనే తిరుగుతున్నాయన్న ఆయన.. మూసీ, హైడ్రా, లగచర్ల నుంచి పరిగి వరకు పేదల ఇళ్లు, భూములపైనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూములను వదిలేసి, పేదల పొట్ట కొట్టి సాగు భూములను సేకరించడం వెనుక భారీ కుట్ర ఉందని విమర్శించారు.

రైతుల భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాటం ఆగదు
22ఏ నిషేధిత జాబితాను తక్షణమే రివ్యూ చేసి ఎత్తివేయాలని, ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ఉన్నా, అది జిల్లాకు శాపంగా మారిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ లకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా, ఎకరాకు రూ. కోటి విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు.

కచ్చితంగా పరిగి వెళ్లి తీరుతా..
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా, ఎకరాకు కోటి రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతులు భూములు కోల్పోతున్నారు. తాము భూములు ఇవ్వలేమని వారు కన్నీరుమున్నీరవుతుంటే, అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి భక్షకుడిలా మారారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులు తనను అడ్డుకోలేరని, ఖచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.