Take a fresh look at your lifestyle.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొల్లాపూర్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సోమవారం నిర్వహించిన వరి కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో పలు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా హమాలీలు, రవాణా సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.

జిల్లాలో కొనసాగుతున్న వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై సమగ్ర వివరాలను వెల్లడిస్తూ, గత పది రోజులుగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. సంబంధిత శాఖల అధికారులతో పలు సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డును పార్లమెంట్ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు సమయానికి తరలించేందుకు అవసరమైన హమాలీలు, లారీలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

తేమ పరీక్షలు, తూకం ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థపై పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర చెల్లింపులు ఆలస్యం కాకుండా 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.