ముద్ర ప్రతినిధి, బీబీనగర్:
కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బీబీనగర్ మండలం గొల్లగూడెం లో చోటుచేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …మండలంలోని గొల్లగూడెం కి చెందిన మేకల మహేష్ కు వలిగొండ మండలం వేములకొండ కి చెందిన ఐశ్వర్య (27) తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి ఝాన్సీ (2), ఒక అబ్బాయి పండు (11 నెలలు ) ఉన్నారు. రెండేళ్ల కిందట దంపతుల మధ్య గొడవ జరగడంతో ఐశ్వర్య సంబంధీకులు మహేష్ ను కొట్టి ఆమెను తల్లి దండ్రుల వద్దకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె తల్లి దండ్రుల వద్దే ఉంటుంది. ఐశ్వర్య గొల్లగూడెం నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేటప్పుడు తాను 4 నెలల గర్భిణి. తనను గ్రామంలో అందరి ముందు కొట్టి అవమానించారని మహేష్ అప్పటి నుంచి భార్య పిల్లలను చూడటానికి వెళ్లలేదు. ఉద్యోగ రీత్యా వికారాబాద్ సమీపంలోని శంకర్ పల్లి లో ఉంటున్నాడు. కనీసం కొడుకు పుట్టాక కూడా అటు వైపు చూడలేదు. సోమవారం ఐశ్వర్య పెద్దమ్మ , పెద్దనాన్నలు ఐశ్వర్యను తన ఇద్దరి పిల్లలను గొల్లగూడెం తీసుకొచ్చి అత్తారింట్లో వదిలి వెళ్లారు. ఇదిలా వుండగా సాయత్రం అత్తా మామ కు భోజనం పెట్టి అందరూ తిన్నాక ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పడుకుంది . మంగళవారం పొద్దెక్కినా కూడా ఐశ్వర్య, పిల్లలు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు తీసి చూసే సరికి గదిలో ఆమె చీరతో ఉరి వేసుకొని , కింద చాపలో ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ లకు ఆమె గదిలో సూసైడ్ నైట్ స్వాధీనం లభ్యమయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
